Twitxy Saved

Collector Peddapalli

Verified account This account is verified. Learn more

@Collector_PDPL

83 Following 13K Followers 3.1K Posts

Latest posts 5

Collector Peddapalli Verified account @Collector_PDPL
పెద్దపల్లి నవంబర్ 11:
------------------------------------------------

*ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి – రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*

*నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడత రీసర్వే లక్ష్యాన్ని పూర్తి చేయాలి*

*రీసర్వేలో నాణ్యతకు ప్రాధాన్యత.. తొందర పాటుతో తప్పులకు తావివ్వకూడదు*

*మండలాల వారీగా ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు*

*లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి*

*రీసర్వేలో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు*

*భూముల రీసర్వే ప్రక్రియపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
--------------------------------------------

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, సానుకూల వాతావరణంలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రీసర్వేలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, తొందరపాటుతో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

బుధవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్ష నిర్వహించారు. *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ బి శ్రీరాములు* తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,* భూముల రీసర్వే ప్రక్రియపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని, ఉమ్మడి జిల్లాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు రెవెన్యూ అంశాలపై సమీక్షలు నిర్వహించామని తెలిపారు.

రీసర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు గ్రౌండ్ రిపోర్టులను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. రీసర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలు, లోపాలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చిస్తున్నామని తెలిపారు.
రీసర్వే ఎస్‌ఓపీని పకడ్బందీగా అమలు చేయాలి
భూముల రీసర్వేకు సంబంధించి రూపొందించిన ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ)ను అధికారులు పక్కాగా అమలు చేయాలని మంత్రి సూచించారు.
Collector Peddapalli Verified account @Collector_PDPL
పెద్దపల్లి నవంబర్ 10:-
-----------------------------------------

*వీధి కుక్కల నియంత్రణకు జీవో నెం.15ను పకడ్బందీగా అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*

*మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి*

*పశువైద్య శాఖ సమన్వయంతో స్థానిక సంస్థలు సమగ్ర కార్యాచరణ చేపట్టాలి*

**వీధి కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్*
-----------------------------------------

జిల్లాలో వీధి కుక్కల దాడుల నివారణకు, వాటి నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15ను పకడ్బందీగా అమలు చేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీధి కుక్కల నియంత్రణ, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.15లో పొందుపరిచిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంతో పాటు ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో వీధి కుక్కలను ఇతర ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని తెలిపారు. ఇతర మార్గాలు లేని ప్రత్యేక పరిస్థితుల్లో సంబంధిత నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు.

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలు పశువైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఆదేశించారు. వీధి కుక్కల నియంత్రణకు అవసరమైన సిబ్బంది, వనరులను సమకూర్చుకొని సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ నరేందర్,జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వేణు గోపాల్ రావు,డీపీఓ శ్రీమాల,ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Collector Peddapalli Verified account @Collector_PDPL
పెద్దపల్లి,2026,నవంబర్-10:
-------------------------------------------
*ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*

*బియ్యం కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు*

*జిల్లా వ్యాప్తంగా 50 దుకాణాల్లో తనిఖీలు.. 9 కేసులు నమోదు*

*ప్రతి దుకాణం ఎదుట ధరలు, రోజువారీ నిల్వ వివరాల బోర్డు ఏర్పాటు చేయాలి*

**బియ్యం ధరలపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్*
--------------------------------------------

జిల్లాలో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించేలా వ్యాపారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బియ్యం అక్రమ నిల్వలకు పాల్పడినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అక్టోబర్ 30న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ పరిధిలోని పలు హోల్‌సేల్, రిటైల్ బియ్యం దుకాణాల్లో క్షేత్రస్థాయి అధికారులు విస్తృత ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహశీల్దార్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు దుకాణాలు, గోదాముల్లోని బియ్యం నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ధరల పట్టికలు, తూకాలు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం BPT/KNM రకం బియ్యం మిల్లు వద్ద కిలో రూ.62, హోల్‌సేల్ ధర రూ.64, రిటైల్ ధర రూ.66గా, RNR/తెలంగాణ సోనా రకం బియ్యం మిల్లు వద్ద కిలో రూ.70, హోల్‌సేల్ ధర రూ.72, రిటైల్ ధర రూ.74గా, HMT/జై శ్రీరామ్ రకం బియ్యం మిల్లు వద్ద కిలో రూ.75, హోల్‌సేల్ ధర రూ.77, రిటైల్ ధర రూ.79గా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. వ్యాపారులు ఈ ధరలకు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు.

ప్రతి దుకాణం, మిల్లు ఎదుట వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా రోజువారీ బియ్యం నిల్వ వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరలతో కూడిన బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ లైసెన్స్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతిపత్రాలను తనిఖీ అధికారులకు చూపించేందుకు సిద్ధంగా ఉంచాలని, రోజువారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు.

26 కిలోల బియ్యం బస్తా పేరుతో 24 లేదా 25 కిలోల బియ్యం విక్రయించినట్లయితే మోసపూరిత కొలతల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నవంబర్ 4, 2026 నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 బియ్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 9 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అక్రమ నిల్వలు, ధరల ట్యాంపరింగ్, తూకాల్లో తేడాలు, రికార్డుల నిర్వహణలో లోపాలు గుర్తిస్తే నిత్యావసర సరుకుల చట్టం (Essential Commodities Act) ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
Collector Peddapalli Verified account @Collector_PDPL
పెద్దపల్లి, 2026 నవంబర్ 10:
------------------------------------------

*పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*

*ఆసుపత్రిలో ఆహారం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి*

*ప్రతి రోగికి ఆరోగ్య కార్డులు, వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి*

*వైద్యులు, సిబ్బంది ఇదే అంకితభావంతో సేవలందించాలి*

*పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
------------------------------------------

పెద్దపల్లిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఆసుపత్రిలో ఆహారం, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు.

మంగళవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* పెద్దపల్లిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ప్రతి ఓపీ వార్డు, లేబర్ రూమ్, క్యాజువాలిటీ విభాగం, ఆపరేషన్ థియేటర్, ఐసీయూ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా విభాగాల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, రోగులకు అందిస్తున్న చికిత్స, వైద్యులు, సిబ్బంది విధుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయం తో పని చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు, విధుల పట్ల చూపుతున్న అంకితభావాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

*ఆహారం, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదు*

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు అందించే ఆహారం నాణ్యంగా, పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. వంటశాల, ఆహార తయారీ ప్రాంతాలు, భోజన ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదీ లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఆసుపత్రి వార్డులు, మరుగుదొడ్లు, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని, ఎక్కడా అపరిశుభ్రత కనిపించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

*ప్రతి రోగికి ప్రభుత్వ వైద్య పథకాల ప్రయోజనాలు అందించాలి*

పేద, నిరుపేద రోగులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందాల్సిన వైద్య సహాయం సకాలంలో అందేలా చూడాలని, అవసరమైన మార్గదర్శకత్వం కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, వాటిని వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆసుపత్రిలోని అన్ని విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఈ తనిఖీలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Collector Peddapalli Verified account @Collector_PDPL
మంథని, 2026 నవంబర్ 10:
-----------------------------------------
*మంథని పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*

*రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాల తరలింపు పనులు త్వరగా పూర్తి చేయాలి*

*మంథని–గోదావరిఖని రహదారి, పుష్కర ఘాట్, మహాలక్ష్మి ఆలయ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి*

*రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి*

*మంథని పట్టణంలో రోడ్డు నిర్మాణ, విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
-----------------------------------------

గోదావరి పుష్కరాల దృష్ట్యా మంథని పట్టణంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ, విస్తరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మంథని మున్సిపల్ పరిధిలోని మంథని–గోదావరిఖని రహదారి నిర్మాణ పనులను, పుష్కర ఘాట్ సమీపంలో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను, మహాలక్ష్మి ఆలయ రోడ్డు విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,* మంథని పట్టణంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, రోడ్డు విస్తరణ పనులకు ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

మంథని–గోదావరిఖని రహదారి, పుష్కర ఘాట్ సమీపంలోని రోడ్డు నిర్మాణ పనులు, మహాలక్ష్మి ఆలయ రోడ్డు విస్తరణ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు నిర్మాణ, విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

ఈ పర్యటనలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ మనోహర్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.